శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం మొదటి విడత సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు. ఆయా సబ్జెక్టుల బోర్డుల ఏర్పాటు అనంతరం దిద్దుబాటును ఆరంభించారు. ఈ సబ్జెక్టులకు నియామకమైన స్క్రూటినైజర్లు సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. సీఈలు, ఏఈలకు ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జవాబుపత్రాల దిద్దుబాటులో అప్రమత్తంగా వ్యవహరించాలని, దిద్దుబాటును, మార్కుల పోస్టింగులు, మిగిలి న ఖాళీ పేపర్ల పరిశీలన, బబ్లింగ్, వంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతిఒక్కరూ స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్‌ఐఓ సురేష్‌కుమార్ స్పష్టంచేశారు. బీఐఈఏపీ కాలేజ్ లాగిన్‌లోని అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను కళాశాల యాజమాన్యాలు/ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలన్నారు. గైర్హాజరైనవారిపై బోర్డు ఆదేశాల మేరకు తగు చర్యలు ఉంటాయని ఆర్‌ఐఓ వెల్లడించారు.


