శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ దుయ్యబట్టారు.
జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్‌లో శనివారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ వేలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్‌ను రద్దుచేసి లక్ష ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబునాయుడు, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక పోవడం సిగ్గు చేటన్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు ఆర్.అరవింద్, వసంతరావు, సంతోష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


