ఎంత చెబితే అంతే..! | - | Sakshi
Sakshi News home page

ఎంత చెబితే అంతే..!

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

రణస్థలం:

కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నీ కష్టాలే వెంటాడుతున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల నష్టపోయిన పంటలకు ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడంతో రైతులు కుదేలైపోయారు. రబీలో పంటలు సాగు చేద్దామంటే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. తాజాగా చేతికి అందుతున్న మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించక, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో వరి, అపరాలు తర్వాత మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చేసినా మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వరకు రూ.2300 వరకు పలికిన క్వింటా ధర ప్రస్తుతం రూ.1600కు పరిమితమైంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల ఎంత చెబితే అంతకే అమ్మకాలు జరపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు చాలాచోట్ల మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి. మద్దతు ధర పెరిగితే కోతలు మొదలుపెడతామని మరికొందరు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గత ప్రభుత్వమే మేలు..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏటా ఫిబ్రవరిలోనే మార్కెటింగ్‌ శాఖ అధికారుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. మద్దతు ధర ప్రకటించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పొలం వద్దకే బస్సులు పంపించి మరీ మొక్కజొన్న కొనుగోలు చేసేవారు. అప్పట్లో రూ.2400 వరకు మద్దతు ధర ప్రకటించారని, రవాణా ఖర్చులు లేకుండా అంతా జగన్‌ ప్రభుత్వమే చూసుకుండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

మద్దతులేక రైతుల గగ్గోలు..

ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుకు సుమారు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి అవుతుంది. బాగా పండితే ఎకరాకు 35 క్వింటాళ్ల నుంచి 43 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అమ్మే సమయానికి క్వింటాల్‌ మద్దతు ధర రూ.2400 వరకు ఉంటే సుమారు లక్ష వరకు రాబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.1600 ప్రకారం చూసుకుంటే రూ.70వేలు లోపే వస్తుంది. అంటే ఎకరాకు రూ.30 వేలు చొప్పున, క్వింటాకు రూ.700 వరకు రైతులు నష్టపోతున్నారు.

తెరుచుకోని కేంద్రాలు..

కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు బయట కనిపిస్తున్న చేష్టలకు పొంతన లేకుండాపోతోంది. ఇటీవల కూటమి నాయకులు ఎక్కడికక్కడ ఉపన్యాసాల్లో మొక్కజొన్న రైతును ఆదుకుంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. మొక్కజొన్న మద్ధతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులపైనా, రైతులపైనా అక్కసు చూపడం సరికాదని, వెంటనే మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యం

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కూటమి ప్రభుత్వం

మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు కుదేలు

మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు..

మొక్కజొన్న పంట వేసిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఉన్నారు. జిల్లాలో 58 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న పంటకు వెంటనే మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

– గొర్లె కిరణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల

ఆదేశాలు రాలేదు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. రైతులకు క్షేత్రస్థాయిలో అదే చెబుతున్నాం. – వి.శ్రీనివాసరావు, ఏడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement