దొంగతనాలే వృత్తిగా.. | - | Sakshi
Sakshi News home page

దొంగతనాలే వృత్తిగా..

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

● ఒకరు 22, మరొకరు 7 కేసుల్లో ముద్దాయిలు

● ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు

రణస్థలం: దొంగతనాలు చేయడంలో ఆరితేరిన ఓ ముద్దాయికి మరొక ముద్దాయి జైల్లో పరిచమయ్యాడు. ఇరువురు కలిసి దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నారు. ఒకే నెలలో 10 దొంగతనాలు చేసి ఆపై వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జె.ఆర్‌.పురం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ ఎం.అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న లావేరు మండలం ఆర్‌.ఆర్‌.వైన్‌ షాపులో చోరీ జరిగింది. షట్టర్‌ పగలగొట్టి లోపల క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ.15 వేలు నగదు, డీవీఆర్‌ బాక్స్‌, జీవో రూటర్‌ బ్యాక్స్‌ను పట్టుకుపోయారు. షాప్‌ సేల్స్‌మెన్‌ బవిరి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నాయని ప్రభుకుమార్‌ (లవ్లీకుమార్‌), బైరెడ్డి మోహన్‌కుమార్‌ (పండు) ఈ చోరీ చేసినట్లు గుర్తించి శుక్రవారం లావేరు మండలం సుభద్రపురం జంక్షన్‌ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు.

జైల్లో పరిచయం..

విజయవాడకు చెందిన లవ్లీ కుమార్‌పై గతంలో 22 చోరీ కేసులు ఉన్నాయి. మూడో తరగతి వరకు చదువుకుని 13 ఏళ్లత వయస్సులోనే చిన్న, చిన్న షాపులు, సైకిల్లు, బైకులు, రాగి బిందెలు వంటి దొంగతనం చేస్తుండేవాడు. ఇలా 22 కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లాడు. రాజమండ్రికి చెందిన బైరెడ్డి మోహన్‌కుమార్‌ తొమ్మిదో తరగతి వరకు చదివి రైల్వే ఫ్లాట్‌ ఫాంపై సమోసాలు అమ్ముకుంటూ సెల్‌ ఫోన్లు దొంగిలిస్తూ నేరాలు చేసేవాడు. ఇద్దరూ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పరిచయమయ్యారు. జైలు నుంచి జనవరి 31న విడుదలైన తరువాత ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలెట్టారు. నెల రోజుల వ్యవధిలోనే విజయవాడ, పెందుర్తి, శ్రీకాకుళం, లావేరు, సబ్బవరం, ఎస్‌.కోట, బొండపల్లి, రామభద్రపురం వంటి చోట్ల జరిగిన చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. దొంగతనంగా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన హోటళ్లలో మద్యం సేవించడం, కోల్‌కత్తా వంటి ప్రాంతాలకు వెళ్లి అసాంఘిక పనులు చేసేవారు. వీరి వద్ద నుంచి రూ.68,800 నగదు, కెమెరా, డీవీఆర్‌ బాక్స్‌లు రికవరీ చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అవతారం తెలిపారు. ముద్దాయిలను పట్టుకున్న లావేరు ఎస్సై కె.అప్పలసూరి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమావేశంలో లావేరు, రణస్థలం ఎస్సైలు కె.అప్పలసూరి, ఎస్‌.చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement