శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ విషయమై శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై టీడీపీ నాయకత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని తరచూ ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి నైతిక బాధ్యత వారే వహించాలన్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన ప్రజాప్రతినిధులకు ఎలాంటి రాజకీయ పరిరక్షణ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలను మరింత విస్త్రృతంగా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు అరవింద్, రామోజీ, వసంతరావు, శ్రీనిధి, అన్నాజీ, హేమంత్, కృష్ణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు


