హిరమండలం : పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసిన ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. హిరమండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న రాత్రి 112 అత్యవసర విభాగానికి వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు కానిస్టేబుళ్లు ఇద్దరు హిరమండలం ప్రధాన రహదారికి వెళ్లారు. అయితే దంత తేజేశ్వరరావు, అల్లాడ మధుబాబు, నీలంశెట్టి మిన్నారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడిచేసే ప్రయత్నం చేశా రు. దీనిపై కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ముగ్గుర్ని అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు.
నేడు అరసం జిల్లా మహాసభ
శ్రీకాకుళం కల్చరల్ : అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభ శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం రెడ్‌క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, చింతాడ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థకు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రంథాలయ పునర్నిర్మాణ ఉద్యమ సంస్థ, రాష్ట్ర కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యుదయ వాదులంతా ఆహ్వానితులేనని తెలిపారు.
జీడి తోటలో మంటలు
టెక్కలి రూరల్ : తొలుసూరుపల్లి గ్రామ సమీపంలోని జీడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గూన వేణుగోపాలరావుకు చెందిన నాలుగు ఎకరాల జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. స్థానిక యువకులు గమనించి మంటలను అదుపు చేశారు.


