శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భూమి కోసం, ఉపాధి హామీ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో సుందరయ్య భవన్‌లో గోపి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించారని, ఆయన స్ఫూర్తితో జిల్లాలో చౌదరి తేజేశ్వరరావు లాంటి నాయకుల నాయకత్వంలో వెనుక బడిన మన జిల్లా అభివృద్ధికి పేదలకు భూ పంపిణీ చేయాలని ఉద్యమాలు, పోరాటాలు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూములు ఎక్కువ భాగం దళితులు, ఇతర పేదల ఆక్రమణలో ఉన్న భూములేనని, గ్రామీణ పేదలకు పని హక్కుగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వంశధార నిర్వాసితుల హక్కుల కోసం నిర్బంధాలను ఎదురించి సమరశీల పోరాటాలు చేసి నిర్వాసితుల పక్షాన పోరాడిన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.నవీన్, కె.చింటు, వినాయక్, పి సురేష్, శంకర్, రాకేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.


