డీఎంహెచ్‌ఓ కార్యాలయ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓ కార్యాలయ ముట్టడి

Mar 17 2026 7:50 AM | Updated on Mar 17 2026 7:50 AM

తమ ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారని హెల్త్‌ అసిస్టెంట్ల ఆవేదన

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని సోమవారం రాత్రి హెల్త్‌ అసిస్టెంట్లు ముట్టడించారు. చీకటి ముసురుకున్నా వారు అక్కడి నుంచి కదలకపోవడం గమనార్హం. గ్రేడ్‌–3 గా ఉన్న తమను గ్రేడ్‌–2కు పదోన్నతి కల్పించడంలో జిల్లా అధికారులు, నేతలు విఫలమయ్యారని, తమ ప్రమోషన్లను నిర్దాక్షిణ్యంగా ఆపేశారని జిల్లాలో వివిధ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు ఆందోళన నిర్వహించారు.

ఇదీ అసలు కథ

2019 అక్టోబరులో రెగ్యులర్‌ ప్రాతిపదికన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం రిక్రూట్‌ అయిన 154 మంది హెల్త్‌ అసిస్టెంట్లు గ్రేడ్‌–3 ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబరులో అన్ని జిల్లాల్లో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్లను గ్రేడ్‌–2 ఉద్యోగులుగా ప్రమోషన్‌ కల్పిస్తూ జీఓ విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోను 2024 నవంబరులో ఈ ప్రక్రియ జరిగినా మన జిల్లాలో ఉన్న 154 మంది రోస్టర్‌ ఫైల్‌ సక్రమంగా సిద్ధం చేసినా అధికారులు ప్రమోషన్‌ కల్పించడంలో విఫలమయ్యారు. నవంబరు 30న వెబ్‌ కౌన్సిలింగ్‌ పేరిట పిలిపించి లిస్ట్‌ మొత్తం సిద్ధం చేసిన అధికారులు డిసెంబరు 1కి ప్రమోషన్‌ లిస్ట్‌ ఆగిపోయిందని చెప్పడంతో అవాక్కయ్యామని, ఆ రోజు నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ బాధ వినలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముట్టడి జరిగేటప్పుడు తమను తొక్కుకుంటూ ఏఓ, సూపరింటెండెంట్‌లు వెళ్లారని, కార్యాలయంలోపలే ఉన్న డీఎంహెచ్‌ఓను కలిసి ప్రమోషన్ల విషయం ప్రస్తావించామన్నారు. ఏఓ, సూపరింటెండెంట్లు సంతకాలు పెట్టేస్తే తాను కూడా పెట్టేస్తానని డీఎంహెచ్‌ఓ చెప్పారని, ఆ తర్వాత ఏఓ, సూపరింటెండెంట్లకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదన్నారు.

పోలీసుల సాయంతో..

డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారన్న విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్‌ఐలు మధు, లక్ష్మిలు తమ సిబ్బందితో చేరుకున్నారు. ముందుగా హెల్త్‌ అసిస్టెంట్ల వద్ద విషయం తెలుసుకుని కార్యాలయంలోపలికి వెళ్లి డీఎంహెచ్‌ఓ అనితను కలిసి మాట్లాడారు. పోలీసుల సాయంతో డీఎంహెచ్‌ఓ బయటకు వచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఫైల్‌ కదల్లేదని, ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ ఐదుగురితో కమిటీ వేసి రోస్టర్‌ ఫైల్‌ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని ఆ నివేదికను ఢిల్లీ ఎస్టీ కమిషన్‌ వద్దకు వెళ్లి నివేదించారని వివరించారు. తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూస్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస వంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం హెల్త్‌ అసిస్టెంట్లు రావడం, వారంతా అర్ధరాత్రి దాటినా అక్కడే ఉండిపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement