శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నారీ శక్తి కోర్సు పేరిట ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ఈ శిక్షణ ప్రారంభించిన కళాశాలగా గుర్తింపు పొందింది. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు ద్వారా ఫిజికల్ ఫిట్‌నెస్, డ్రిల్, సాఫ్ట్ స్కిల్స్ డవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు పేర్కొన్నారు. కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు శారీరకంగా ధృడంగా, మానసికంగా స్థిరంగా ఉండడానికి ఈ నారీ శక్తి కోర్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్, శిక్షకుడిగా వ్యవహరిస్తున్న ఎన్‌సీసీ అధికారి, సీనియర్ మాథ్స్ అధ్యాపకుడు కెప్టెన్ డాక్టర్ ఎన్.రామకృష్ణ మాట్లాడుతూ నారీశక్తి కోర్సు ప్రాధాన్యత, అవసరాన్ని వివరించారు. ప్రతిరోజు శిక్షణ ఉంటుందని, కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


