శ్రీకాకుళం న్యూకాలనీ : కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట ‘నిధి పోర్టల్’ గుదిబండలా తయారైంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలను పస్తులుండేలా చేస్తోంది. జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ‘నిధి’ పోర్టల్ ద్వారా జీతాలను చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పోర్టల్‌లో అనేక అవరోధాలు, సాంకేతిక సమస్యల కారణంగా జీతాలు చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఫిబ్రవరి జీతాలు ఇప్పటి వరకు జమకాలేదు. ఏప్రిల్ జీతాలు సైతం జాప్యమయ్యేలా ఉందని సమాచారం.
అవరోధాలు.. సాంకేతిక సమస్యలు..
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జిల్లాలో 18440 మంది పనిచేస్తున్నారు. వారందరి వివరాలను నిధి పోర్టల్‌లో నమోదు చేసి.. దాని ఆధారంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల వివరాలు ఒకే డేటాబేస్‌లో ఉంటాయని, తద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని భావించి తెరపైకి తీసుకొచ్చారు. అయితే అమల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలంటే ముందుగా సంబంధిత శాఖల క్యాడర్ స్ట్రెంత్ వివరాలు కనిపించాలి. చాలా శాఖలకు చెందిన క్యాడర్ వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ కాకపోవడంతో డేటా నమోదు ఆగిపోయింది. ఫలితంగా బిల్లులు రూపొందించలేకపోతున్నారు. ఆయా శాఖల్లో యూడీసీలు, అకౌంట్స్ సిబ్బంది రోజూ పోర్టల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో కూటమి సర్కారు తీరుపట్ల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ఉన్న ఫలంగా నిధి పోర్టల్ పేరిట జీతాలు లేకుండా చేయడం పట్ల వారంతా ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.
నిధి పోర్టల్‌లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే. అందులో అప్‌లోడింగ్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్టు తెలిసింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.
– ఆర్.సురేష్‌కుమార్,
ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ, శ్రీకాకుళం
ఇప్పటికే ఫిబ్రవరి ముగిసినా జీతాలు అందలేదు. జీతాలు లేమితో గృహ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు, ఈఎంఐల చెల్లింపులు వంటి అంశాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధి పోర్టల్, ఖజానా శాఖ అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల కల్పించుకుని జీతాల చెల్లింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగ, లెక్చరర్ల సంఘ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నిధి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిలిచిన జీతాలు
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని కూటమి సర్కారు
జిల్లాలో 18440 మందిపై ప్రభావం


