ఎచ్చెర్ల : కుశాలపురం బైపాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై 4.1 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా యువకుడిని ఆదివారం ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేశారు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా అస్కా తాలుకా మంగులూర్ గ్రామానికి చెందిన శ్రీహరిప్రధాన్ ఓ బ్యాగులో రెండు ప్యాకెట్లతో 4.1 కిలోల గంజాయిని బెంగళూరు తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు ఎస్సై లక్ష్మణరావు, సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్‌తో కలిసి మాటువేశారు. కుశాలపురం బైపాస్‌రోడ్డు కూడలి వద్ద వీరిని చూసి యువకుడు పారిపోతుండగా పట్టుకున్నారు. బెంగళూరులోని భరత్ అనే వ్యక్తికి అప్పగించేందుకు వెళ్తున్నట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
బూర్జ: శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహదారిలో సింగన్నపాలెం కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీరు జీవన్‌కుమార్ (32) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్‌కుమార్ ద్విచక్ర వాహనంపై కొల్లివలస నుంచి ఉప్పినివలస వస్తుండగా సింగన్నపాలెం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీవన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జీవన్‌కుమార్‌కు భార్య ఆదిలక్ష్మి అలియాస్ పుష్ప, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ పి.రమణ తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
టెక్కలి రూరల్: తిర్లంగి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సైన రాములు(80) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాములు తిర్లంగి గ్రామ సమీపంలో అక్కవరం వైపు వెళ్లే మార్గంలో సాగునీటి కాలువలో స్నానం చేసేందుకు వెళ్తిల తిరిగి వస్తుండగా అదే మార్గంలో ట్రాక్టర్ వెనుక్కు తిప్పుతుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందాడు. రాములుకు భార్య లచ్చమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శతాధిక వృద్ధుడు మృతి
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో అల్లువీధికి చెందిన లోతుగెడ్డ రాములు(110) ఆదివారం అనారోగ్యంతో తన నివాసంలో మృతి చెందారు. 1916లో జన్మించిన రాములు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యపరిచేలా గీతాలు ఆలపించేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. రాములు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


