శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆడిటోరియంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా మహిళా చైతన్య సదస్సు నిర్వహిస్తున్నామని, మహిళా ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి జి.శారద శ్రీకాకుళం రూరల్ ప్రధాన కార్యదర్శి కరుకోల సురేష్‌కుమార్, మహిళా విభాగం నాయకులు టి.సౌజన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించి సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి అధ్యక్షతన జరిగే చైతన్య సదస్సులో ‘మహిళలు–నాయకత్వం– బాధ్యతలు’ అనే అంశంపై ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ‘మహిళలు – సమానత్వం’ అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మణి, ‘విద్యారంగం– మహిళల పాత్ర’ అనే అంశంపై యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్, ‘సమాజంలో మహిళలు –ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఎన్.అరుణకుమారి వక్తలుగా పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం ఉపాధ్యాయుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమస్యలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.


