ఎచ్చెర్ల: సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి దూరంగా ఉంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజని అన్నారు. శుక్రవారం కుశాలపురం సమీపంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నక్ కళాశాలలో జాబ్ అచీవర్స్ డే వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లోనూ గొప్ప అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. అన్ని వేళలా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ప్రిన్సిపాల్ టి.విక్టర్‌పాల్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో కళాశాల ఎన్నో విజయాలను సాధించిందన్నారు. 90 శాతం ఉత్తీర్ణత, నూరుశాతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌తో విద్యార్థులు కళాశాలకు గర్వకారణంగా నిలిచారన్నారు. అనంతరం ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.


