ఆమదాలవలసలో పదో తరగతి పరీక్షల సెంటర్ కేటాయింపుపై ఆరోపణలు ముగ్గురున్న పాఠశాల విద్యార్థులకు రెండు కేంద్రాల కేటాయింపు 43 మంది ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు ఒకే కేంద్రం విమర్శలకు తావిస్తున్న విద్యా శాఖాధికారుల తీరు రెండేళ్లుగా ఇవే తప్పులు
మా ప్రమేయం లేదు..
సమస్యే కాదు..
ఆమదాలవలస :
ఆమదాలవలస పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల సెంటర్ కేటాయింపుల్లో అధికారుల తీరు సక్రమంగా లేదని, దీనివల్ల మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 11 ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులకు వేర్వేరు కేంద్రాల కేటాయింపు జరగ్గా, ఒక ప్రైవేటు పాఠశాలలో మాత్రం పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ పాఠశాల నుంచి 43 మంది విద్యార్థులకు గేటులోని మున్సిపల్ హైస్కూల్ కేంద్రం కేటాయించారు. ఇక్కడే ఉన్న మరో పాఠశాలలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మాత్రమే ఉండగా వీరికి పట్టణంలోని రెండు కేంద్రాలు కేటాయించారు. ముగ్గురున్న పాఠశాల విద్యార్థులకు రెండు కేంద్రాలు, 43 మంది విద్యార్థులున్న పాఠశాల విద్యార్థులకు ఒకే కేంద్రాన్ని కేటాయించడం ఎంత వరకు సమంజసమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారని తీరు..
ఇదే ప్రైవేటు పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థులందరికీ 2023 – 24 విద్యా సంవత్సరంలో సమీపంలోని మరో ప్రైవేటు స్కూల్‌ను కేంద్రంగా కేటాయించగా అప్పట్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత సంవత్సరం ఆ కేంద్రాన్నే రద్దు చేశారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో అదే ప్రైవేటు పాఠశాల విద్యార్థులందరికీ గేటు మున్సిపల్ హైస్కూల్ కేటాయించగా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో తమకు సంబంధం లేదని జిల్లా విద్యా శాఖాధికారుల నుంచి రాష్ట్ర విద్యాశాఖాధికారులు వరకు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకున్నారు. తాజాగా ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో అదే పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులకు గత ఏడాదిలాగే అదే మున్సిపల్ హైస్కూల్ గేటు ప్రాంతంలో కేంద్రం కేటాయించారు. ఇలా ఏటా విద్యా శాఖాధికారులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంటని ఫిర్యాదులు చేస్తే.. ఆ రెండు స్కూళ్లు ఒక జోన్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు. అయితే, అంతకంటే దూరంలో ఉన్న వెదుళ్లవలస, కొర్లకోట వంటి దూర ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ జోన్ పరిధి దాటించి పట్టణంలోని పలు కేంద్రాలకు కేటాయిస్తుండటం గమనార్హం.
ఎక్కడా ఇలా లేదు...
రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఒకే పాఠశాలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం కేటాయించడం లేదు. కానీ ఆమదాలవలసలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఇలా ఓ ప్రైవేటు పాఠశాలకు కొమ్ముకాస్తూ విద్యాశాఖాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తెలివైన విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆమదాలవలస పట్టణంలో ఒకే పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులకు గేటు ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో కేటాయించడం వాస్తవమే. అయితే ఆ ప్రక్రి య కమిషనర్ కార్యాలయం నుంచి జరుగుతుంది. ఇందులో మా ప్రమేయం లేదు.
– కె.ఎ.రాములు, ఆమదాలవలస ఎంఈఓ
సుమారు 280 మంది పట్టే సెంటర్‌లో ఒకే స్కూల్‌కు చెందిన 43 మంది విద్యార్థులను వేయడం పెద్ద సమస్య కాదు. విద్యార్థులను పరీక్ష సమయంలో విడివిడిగా కూర్చోబెడతా రు. దీనివల్ల ఏమీ ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఇలా ఒకే స్కూల్ విద్యార్థులను ఒకే పరీక్ష కేంద్రంలో వేసినట్లు మా దృష్టికి వస్తే సరిచేసేందుకు చర్యలు చేపడతాను.
– రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి


