కాలయాపన చేస్తే సహించేది లేదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● టెక్కలిలో రెవెన్యూ క్లీనిక్
● వివిధ భూ సమస్యలపై 125 అర్జీలు స్వీకరణ
టెక్కలి: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు కాలయాపన చేస్తూ.. అర్జీదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. సోమవారం టెక్కలి సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రెవెన్యూ క్లీనిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొన్ని రకాల కారణాలతో పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ క్లీనిక్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ భూ సమస్యలపై 125 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో వీఎస్ లక్ష్మణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను పరిశీలిస్తే...
● టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేష్ తనకు చెందిన భూమి మరొకరి పేరును మారిపోయిందని, దానిని సరి చేయాలని కోరారు.
● కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో రైల్వే ఫ్‌లై ఓవర్ వంతెన కోసం చేపట్టిన సర్వేలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జిరాయితీ స్థలంలో రాళ్లు పాతారని, దీనిపై న్యాయం చేయాలని బి.జయప్రసాద్ కోరారు.
● కొత్తూరు మండలంలోని మెట్టూరు గ్రామంలో ఉన్న గ్రామకంఠం ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ● తన భూమికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు చేయడంతో పాస్ పుస్తకాల్లో తప్పులు చోటు చేసుకున్నాయని, వాటిని సరిచేయాలని టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన పేడాడ శార్వాణి కోరారు.
● టెక్కలి మండలంలోని చింతలగార సమీపంలో తమ భూమికి సంబంధించిన వివాదంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడమే కాకుండా తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని రాధావల్లభాపురం గ్రామానికి చెందిన బగాది కృష్ణారావు విన్నవించారు.


