అర్జీలపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై తక్షణమే స్పందించాలి

Feb 3 2026 7:12 AM | Updated on Feb 3 2026 7:12 AM

అర్జీలపై తక్షణమే స్పందించాలి

అర్జీలపై తక్షణమే స్పందించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌కు 41 వినతులు

టెక్కలి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు సుమారు 41 వినతులు స్వీకరించారు.

వినతులు పరిశీలిస్తే...

● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్న వారిని రిఫర్‌ పేరుతో పంపించేస్తున్నారని, అంతేకాకుండా ప్రైవేట్‌ క్లీనిక్‌లు అధికమై రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అందకుండా చేస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్‌జీ తదితరులు ఫిర్యాదు చేశారు. ● తనకు పీఎం కిసాన్‌ సాయం పడడం లేదని, సమస్యను పరిష్కరించాలని టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన జనపాన నీలయ్య విన్నవించారు. ● తన తండ్రి పేరున ఉన్న ఇంటి పన్నును తన పేరుకు మార్చాలని టెక్కలికి చెందిన నేపాలం బలరాం కోరారు.

● తన భర్త ప్రమాదవశాత్తు గాయపడి ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నారని, అతనికి దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ముడిదాన దుర్గ విన్నవించారు. ● తన కుమారుడు ధనుష్‌కు దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన జామి సంతోషికుమారి వినతి అందించారు.

● నందిగాం మండలంలోని పాలవలస గ్రామానికి ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. ● టెక్కలి మండలంలోని సీతాపురం గ్రామంలో రోడ్డుకు ఆనుకుని నివసిస్తున్న 8 మంది ఎస్సీ కుటుంబాలకు కాలనీ ఇళ్లు మంజూరు చేశారని, అయితే అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా కుటుంబాలు విన్నవించారు. ● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన ఆదివాసీ కుటుంబానికి చెందిన పసికందు మృతి చెందిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. ● తనకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉండడం వలన ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నానని, తనకు పింఛన్‌ మంజూరు చేయాలని సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన చల్లా రాజారావు విన్నవించారు. ● ఎలక్ట్రికల్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పింఛన్‌ మంజూరు చేయాలని టెక్కలి గోపినాథపురం గ్రామానికి చెందిన సత్తారు ప్రేమ్‌చంద్‌ కోరారు. ● గత కొన్ని సంవత్సరాలుగా అందుతున్న దివ్యాంగ పింఛన్‌ను సాంకేతిక కారణాలతో ఆపేశారని, దీనికి సంబంధించి అన్ని రకాల క్లియరెన్స్‌ పత్రాలు సమర్పించినప్పటికీ పింఛన్‌ అందజేయడం లేదని టెక్కలికి చెందిన గొంటి వెంకటరత్నం విన్నవించారు. ● టెక్కలి అంజనాపురం సమీపంలోని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డి.రాజ్‌కుమార్‌రెడ్డి కోరారు.

జిల్లాకేంద్రంలో బోసిపోయిన పీజీఆర్‌ఎస్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ను సోమవారం నిర్వహించారు. అయితే కలెక్టర్‌, జేసీ ఇతర అధికారులు టెక్కలి రెవెన్యూ క్లీనిక్‌కి వెళ్లడంతో బోసిపోయింది. జిల్లా రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్‌ విభాగాలు సమన్వయంతో వినతులు స్వీకరించారు. డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, డీఎస్‌వో సూర్య ప్రకాష్‌లు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement