ఇప్పిలి నుంచి ఢిల్లీకి..
● గణతంత్ర వేడుకలకు ఇద్దరు
విద్యార్థినులకు పిలుపు
● ఒకరికి రాష్ట్రపతితో విందు చేసే చాన్స్
శ్రీకాకుళం/శ్రీకాకుళం రూరల్: ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 9వ తరగతి చదువుతున్న ఇప్పిలి సంజన, పిల్ల అలేఖ్యలు అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్ నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి జనవరి 26న రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందుకున్నారు. అటల్ మారథాన్, స్కూల్ ఎన్నో వేషాలు మారథాన్‌లో వీరు ఎంపికయ్యారు. అవర్ స్కూల్ ఎలక్ట్రికల్ బిల్ ఇస్ నిల్ విత్ మై డివైస్ (డ్యూయల్ యాక్సెస్ సోలార్ ట్రాకర్ సిస్టం) పేరిట వీరు ప్రాజెక్టును రూపొందించారు. జాతీస్థాయిలో తొలి 1000 స్థానాల్లో ఉండడంతో పాటు అటల్ ప్రీ పెన్యూర్ ప్రోగ్రాంలోతొలి 30 స్థానాల్లో నిలిచాయి. వీరిద్దరితోపాటు గైడ్ టీచర్ సువ్వారి ఉమామహేశ్వర కూడా పాల్గొంటారు. మరోవైపు, అటల్ ఇన్నోవేషన్ మిషన్ తరఫున ఇప్పిలి సంజన రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోమ్ విందులో పాల్గొనేందుకు కూడా ఆహ్వానం అందింది. జాతీయస్థాయిలో ఈ విందుకు ఆరుగురు ఎంపిక కాగా, అందులో సంజన ఒకరు. ఈ సందర్భంగా విద్యార్థినులను డీఈవో రవిబాబు, ఉప విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఎంఈఓ సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు.


