కాశీబుగ్గ వెంకన్న ఆలయ పునఃప్రారంభానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం(చిన తిరుపతి) పునఃప్రారంభానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో ఆలయం మూసి వేశారు. తాజాగా ఆలయాన్ని పునఃప్రారంభించే చర్యల్లో భాగంగా మంగళవారం దేవదాయశాఖ అధికారి గురునాథ్, రావివలస ఆలయ దేవస్థానం కార్యదర్శి గురునాథరావు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద పండాతో మాట్లాడారు. క్యూలెన్లు, బారికేడ్లు, గ్రిల్స్, ఐరన్ రెయిలింగ్స్, ఎగ్జిట్ మార్గాల పనులను పరిశీలించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.


