రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నందిగాం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతల అగ్రహారం గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కాపు తెంబూరుకు చెందిన గజరాపు నగేష్ (31) మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గజరాపు పద్మలోచన, మాలతి దంపతుల కుమారుడు నగేష్ లగేజీ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. విజయవాడలో ఉన్న ఒక కుటుంబం టెక్కలికి మారేందుకు గాను వారి సామాన్లు తీసుకొచ్చేందుకు నగేష్ ఆదివారం లగేజీ వ్యాన్‌తో పాటు సింగుపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ సామాన్లు లోడ్ చేసుకొని తిరిగి వస్తూ సోమవారం వేకువజామున విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతల అగ్రహారం జంక్షన్ వద్ద వ్యాన్ ఆపి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌లో వెళ్లిన సింగుపురం వ్యక్తులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య భవానీ, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసు లాంచనాలు పూర్తయిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.


