ముస్తాబు..!
ప్రభుత్వ పాఠశాలలో డైలీ హైజిన్ అండ్ డిసిప్లేన్ పేరుతో ముస్తాబు కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. దీనికోసం జీవో నంబర్ 43ను విడుదల చేశారు. ప్రతీ తరగతి గదిలో విధిగా ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలని ఆ జీవోలో నిర్దేశించారు. ఆ కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్, పౌడర్ ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. చేతులు శుభ్రం చేసుకునే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభ్రత చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించే మెటీరియల్ కూడా ప్రదర్శించాలి. ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులకు తొలుత శిక్షణ ఇవ్వాలి. వారం వారం ముస్తాబు ‘స్టార్ ఆఫ్ ది వీక్‘ ఎంపిక చేయడం, రివార్డులు ఇవ్వడం క్రమం తప్పకుండా జరగాలి. ఇదంతా ఉపాధ్యాయులే చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చేవారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తల దువ్వడం లేదా, దువ్వించడం చేయించాలి. అయితే ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక పాఠాలు మానేసి విద్యార్థులను ముస్తాబు చేస్తూ కూర్చోవాలా అంటూ ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరమే కానీ ఈవిధంగా ఉపాధ్యాయులపై భారం మోపడం సరికాదని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆగమేఘాలపై ప్రారంభం కావాలనే ఆదేశాలతో పలు పాఠశాలల్లో నామమాత్రంగా ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశారు.
బాబు మార్కు
డాబు..
శ్రీకాకుళం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ.. వారిని బోధనేతర పనులకు వినియోగించనని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ఆ మాటలు గాలికొదిలేసి బోధనేతర పనులు పెంచేస్తున్నారని ఉపాధ్యాయులు కూటమి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ కోసం ఇతర శాఖల అధికారుల నియామకంతో తమపై ఒత్తిడి పెంచారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకంపై ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పుడు తమపై ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం కూటమి ప్రభుత్వం మోపిందని మండిపడుతున్నారు. దీనికోసం ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడాన్ని తప్పుబడుతున్నారు.
●
బడుల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు
జీవో విడుదల చేసిన ప్రభుత్వం
బోధనేతర పనులపై ఉపాధ్యాయుల ఆగ్రహం
బోధనా సమయం వృథా అవుతుందని ఆవేదన
ముస్తాబు..!
ముస్తాబు..!


