విచారణ ఏమైంది సారూ..!
అరసవల్లి: తనకు ఉద్యోగమిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వైద్యశాఖ ఉద్యోగులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఆ బాధితురాలికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. జిల్లా వైద్యారోగ్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమిప్పిస్తానంటూ రెండేళ్ల క్రితం ఏకంగా రూ.4.50 లక్షల వరకు తీసుకుని.. తీరా నకిలీ ఉద్యోగ నియామక ఆర్డర్‌ను చేతిలో పెట్టేసి వదిలించుకున్న వైద్యశాఖ అక్రమార్కులైన ఇద్దరు ఉద్యోగులపై ఇచ్చిన ఫిర్యాదుపై నేటికీ చర్యలు చేపట్టలేదు. వైద్యశాఖలో హెచ్చుమీరిన అక్రమాలు, అవినీతి ఆగడాల్లో ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్ర కీలకమని ఆధారాలున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం మామూళ్ల మత్తుకు దాసోహమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధిత మహిళలకు న్యాయం జరగదని మరోసారి రుజువైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ విషయం
శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక మహిళకు వైద్యారోగ్య శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.4.50 లక్షలు డబ్బులు తీసుకొని మోసం చేశారు. దీంతో బాధితురాలు గతేడాది జనవరి చివరిలో వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగులకు తాను చెల్లించిన డబ్బుల వివరాలను ఆధారాలతో సహా జత చేసింది. దీంతో ఆగమేఘాల మీద విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 12న జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో విచారణ ప్రక్రియను చేపట్టారు. విశాఖపట్నం డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. అతను బాధితురాలితో పాటు ఆరోపణలున్న కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్‌తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని.. తదనుగుణంగా చర్యలుంటాయని అప్పట్లో విచారణాధికారి వెల్లడించారు. దీంతో తనకు న్యాయం జరిగిపోతుందని బాధితురాలు, ఆమె కుటుంసభ్యులు భావించారు. కానీ నేటికి సుమారు ఏడాది అవుతున్నా, ఇప్పటివరకు ఆ విచారణ ఏమైందో.. నివేదిక ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ కీలకాధికారి వద్ద ప్రస్తావించగా.. అదంతా ‘మేనేజెడ్ సార్’ అంటూ బదులిచ్చారు. దీనిబట్టి చూస్తే జగదీశ్వరరావు చేపట్టిన విచారణపై ఎలాంటి చర్యలుండవని, కూటమి ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరగదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని తీవ్రంగా భావించిన బాధితురాలు న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోందని సమాచారం.
ఉద్యోగం పేరుతో మోసం చేసినట్లు బాధితురాలి ఆవేదన
వైద్యారోగ్య శాఖలో ఇద్దరిపై ఫిర్యాదు
విచారణ ఏమైందో తెలియని వైనం
ఏడాదిగా న్యాయం కోసం బాధితురాలి నిరీక్షణ
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
కార్యాలయం


