క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు
● వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస
సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఆమదాలవలస: సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఆద్యుడని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా అది తన ఘనతేనని చెప్పుకొని క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటారని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో 10 శాతం కూడా తన పాత్ర లేకున్నా.. కర్త, కర్మ, క్రియ తానేనని చెప్పుకోవడం దారుణమన్నారు. 2014 – 2019 మధ్య భోగాపురం విమానాశ్రయంలో పది శాతం పనులు కూడా జరగలేదన్నారు. ఫేజ్ వన్ కింద 2,700 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఐదు శాతం మాత్రమే చేసిందన్నారు. అనంతరం హైకోర్టులో కేసు వేయడంతో భూ సేకరణ నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే పనులు
2019 – 24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని రైతులతో కోర్టు కేసులను ఉపసంహరించుకునేలా చేసి, రూ.960 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేశారని గుర్తు చేశారు. 2,700 ఎకరాల్లో 2,200 ఎకరాలు విమానాశ్రయానికి, మిగిలిన 500 ఎకరాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు కేటాయించారని తెలిపారు. 2023 మేలో ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు.
అనంతరం శరవేగంగా పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో రీల్స్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, సీఎం చంద్రబాబు చేసిన ఘనకార్యం ఏమీ లేదని, ఇప్పటికై నా క్రెడిట్ చోరీని ఆపేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు దుంపల శ్యామలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


