● బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వం అందించిన బూట్లు ధరించలేదనే కారణంతో పదో తరగతి విద్యార్థులను పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు బయటకు గెంటేయడం మండలంలో తీవ్ర వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే... మండలం కొత్త శాసనాం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు సోమవారం బూట్లు ధరించలేదని ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు ప్రార్థనా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి ఆగకుండా విద్యార్థులను బయటకు గెంటేయడంతో వారంతా స్థానిక బస్టాండ్, రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగా రు. వారిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన టెన్త్‌లో ఉన్న విద్యార్థులపై ఈ రకమైన కఠిన చర్యలు అమానవీయమని, విద్య కంటే బూట్లకే ప్రాధాన్యం ఇస్తున్నా రా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా రు. చిన్న కారణాలతో విద్యార్థులను అవమానపరచడం మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడి వివరణ కోరగా... విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందని, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం కనిపించకపోవడంతో వారిలో మార్పు కోసం ఇలా విద్యార్థులను బయటకు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు.


