మత్స్యకారుల్లో అలజడి
● తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన
● ఈ ఏడాది వృథాగా మారిన 56 రోజులు
● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో
ఆకలి కేకలు
ఇచ్ఛాపురం రూరల్:
వరుస తుఫాన్లు గంగపుత్రులను వణికిస్తున్నాయి. రోజుల తరబడి వేటకు వెళ్లలేని దుస్థితిని కల్పిస్తున్నాయి. కుటుంబ పోషణను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు పస్తులతో కాలం గడపాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ ఏడాది దాదాపు ఐదు సార్లు అల్పపీడనం, వాయుగుండాలు, తుఫాన్లు రావడంతో జిల్లాలోని మత్స్యకారులు దాదాపు 56 రోజుల పాటు వేటకు దూరమయ్యారు. తాజాగా మరో తుఫాను ముంచుకొస్తుందంటూ వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు మళ్లీ వేటకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మత్స్యసంపద అంతంత మాత్రమే. తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల సంతోనోత్పత్తి సమయం కావడంతో 61 రోజుల పాటు వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో దాదాపు ఆరు నెలలు పాటు మత్స్యకారులకు అరకొరగా వేట సాగింది. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు వరుస తుఫాన్లు రావడంతో మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ధరలు పతనం..
కొన్ని నెలలుగా సముద్రంలో చేపల వేట సజావుగా సాగక అల్లాడిపోతున్న మత్స్యకారులకు కార్తీక మాసం గుదిబండగా మారింది. జిల్లాలో దొరికే మత్స్య సంపదను అధిక ధరలకు కొనుగోలు చేసే ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు కార్తీక మాసం పేరుతో ముఖం చాటేశారు. దీంతో కిలో రూ.120 నుంచి రూ.180 పలికే చేపలను రూ.50, రూ.60లకు అమ్ముకోవాల్సి వచ్చింది. కాస్తో కూస్తో వలకు చేరిన కవ్వళ్లతో వ్యాపారం చేద్దామనుకున్న సమయంలో మోంథా తుఫాన్ పుణ్యమాని సుమారు రూ.30లక్షలు ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. నవంబర్‌లో వేల రూపాయలు ఆదాయం కల్పించే ఖరీదైన కోనేం చేపలు కూడా వలకు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ అల్లకల్లోలం..
తాజాగా తుఫాన్ హెచ్చరికతో మత్స్యకారులు ఆందోళనకు గురౌతున్నారు. బోట్లను ఒడ్డుకు చేర్చుకోవడం, వలలను సంరక్షించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే మోంఽథా తుఫాన్‌తో చితికిపోయిన మత్స్యకారులు మరో హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు. కనీసం రెండు నాటికల్ మైళ్ల దూరం కూడా వెళ్లలేక వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాదిలో సముద్రంపై వలలను వదులుతూ వాటిని మళ్లీ తిరిగి లాక్కుంటూ రోజంతా శ్రమ పడుతూ రోజుకి రూ.4వేలు నష్టపోతున్నామే కానీ, తగిన ఆదాయం రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
గతంలో ఇలా లేదు..
మునుపెన్నడూ ఈ గతి చూడలేదు. వలకు పదేసి కోనేములు పడే సీజన్ ఇది. ఇప్పుడు ఒక్క కోనేం చేప కూడా పడటం నేదు. కవ్వళ్లు మాత్రం దొరుకుతున్నాయి. దీంతో ఉసూరుమంటూ ఒడ్డుకు తిరిగి వచ్చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా గాలులు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే జీవనం కష్టమే. – మాగుపిల్లి మోహనరావు,
మత్స్యకారుడు, డొంకూరు
ఏడాదిగా అవస్థలే..
వరుస విపత్తులతో సముద్రంలో వేట సజావుగా సాగడం లేదు. ఈ ఏడాదిలో చాలా సార్లు తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు రావడంతో వేట లేక పస్తులుండాల్సి వస్తోంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా బోటు ఒక్కచోట ఆగకపోవడంతో చేపలు వలకు చిక్కడం లేదు. చివరకు పర(ఉప్పుటేరు)లో దొరికే చూపలతో పొట్టపోసుకుంటున్నాం. మొన్నటి వరకు కార్తీక మాసం అని చేపలు బేరం తగ్గిపోగా, ఇప్పుడు అస్సలు చేపలు దొరకడమే గగనంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా చేయడం లేదు.
– బుడ్డ జగ్గయ్య,
మత్స్యకారుడు, డొంకూరు
మత్స్యకారుల్లో అలజడి
మత్స్యకారుల్లో అలజడి
మత్స్యకారుల్లో అలజడి
మత్స్యకారుల్లో అలజడి


