లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్యపోరాటాలు ఉద్ధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. రైతులు పండించే అన్ని పంటలకు కొనుగోలుతో మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని కోరుతూ లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లా డుతూ కార్మికవర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మికచట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లనుగా మార్చి దేశవ్యాప్తంగా అమలుచేయడానికి నవంబర్ 21న ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతి స్థానంలో పరిమితకాల ఉద్యోగం పద్ధతి తెచ్చారని దుయ్యబట్టారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యు ల సంఖ్యను పెంచడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం తగదన్నారు. 2017లో ప్రధానమంత్రి ఇచ్చిన ‘రైతుల ఆదాయం రెట్టింపు’ హామీ పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్.అమ్మన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎస్.కృష్ణవేణి, ఏపీ మెడికల్ సేల్స్ – రిప్రెజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవాది వాసుదేవరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ కిసాన్ కాంగ్రెస్ నాయకులు సనపల అన్నాజీరావు, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల నాయకులు ఆర్.ప్రకాషరావు, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, డి.యుగంధర్, కళ్యాణపు అప్పలరాజు, ఎం.ఆదినారాయణమూర్తి, సీహెచ్ చంద్రశేఖర్, పి.జగ్గారావు, టి.నందోడు పాల్గొన్నారు.


