ఏఎన్‌ఎంల ధర్నా
అరసవల్లి: సచివాలయాల్లో పనిచేస్తున్న వైద్యశాఖ గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించాలంటూ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్‌ఎంల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధి రంగమ్మ మాట్లాడుతూ పొరుగు జిల్లాల్లో గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలు పూర్తయ్యాయని, శ్రీకాకుళంలో మాత్రం అధికారులకు చలనం లేదని..ఇప్పటికై నా ఏఎన్‌ఎంల ఆవేదనను అర్ధం చేసుకుని పదోన్నతులు కల్పించాలని కోరారు.
విద్యుత్ షాక్‌తో వలస కూలీ మృతి
రణస్థలం: లావేరు మండలం గుమ్మడం పంచాయతీ వాళ్లెపేట గ్రామానికి చెందిన వాళ్లె కన్నంనాయుడు(38) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంనాయుడు బతుకు తెరువు కోసం చిలకలూరిపేట టౌన్‌లో పనిచేస్తుండగా ఈ నెల 25న విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో మృతి చెందాడు. కన్నంనాయుడుకు భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం తండ్రి రాముడు చని పోవడం, తల్లి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండటం, కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు : పూండి రైల్వేస్టేషన్‌లో సమీపంలో బుధవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. 30 నుంచి 35 ఏళ్లు వయస్సు కలిగి లైట్ బ్లూ కలర్ జీన్ ఫ్యాంటు, జిప్ ఉన్న ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు ధరించి ఉన్నాడు. తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. ఈ మేరకు స్టేషన్ మాస్టర్ పలాస జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో పలు ఆలయాల అభివృద్ధికి సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి.


