నూతన భవనంలోకి వర్సిటీ కార్యాలయాలు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీలో సుమారు రూ.38 కోట్ల నిధులతో జీ ప్లస్ 4 సముదాయంగా నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ నూతన పరిపాలనా భవనాన్ని వైస్ చాన్సలర్ కె.ఆర్ రజనీ, ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన భవనం ప్రారంభంతో వర్సిటీకి పాలనా పరమైన వసతి సమస్య దాదాపుగా తీరినట్లయ్యిందని తెలిపారు. గత వీసీలు కె.రామ్‌జీ, ఎన్.వెంకటరావు కృషికి తోడు ప్రస్తుత వర్శిటీ ఉన్నతాధికారులు, అవిశ్రాంత ప్రయత్నంతో భవన నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ప్రోటోకాల్ విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అవన్నీ సమసిపోయాయనిచెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం, జాతీయ లా డే కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఈసీ సభ్యులు కె.చక్రపతి, ప్రిన్సిపాల్స్ ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, సీహెచ్ రాజశేఖరరావు, కె.సామ్రాజ్యలక్ష్మీ, భవనం ఆర్కిటెక్చర్ రాదేశ్యాం, సీపీడబ్ల్యూడీ ఏఈ శ్రీనివాస్, జి.పద్మారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు న్యాయ విభాగం అధ్యాపకులు జ్ఞాపికలను వీసీ అందించి అభినందించారు. కాగా రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని వర్శిటీలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి ఘన నివాళులు అర్పించారు.
ప్రజాప్రతినిధులు గైర్హాజరు
భవనం ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఆహ్వానం అందినా ఎవరూ రాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ అధికారులే ప్రారంభించేశారు. ప్రజాప్రతినిధులు వర్సిటీని సందర్శిస్తే ఇక్కడ సమస్యలు వారికి తెలుస్తాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించవచ్చని చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం మొదటి నుంచీ గైర్హాజరవుతునే ఉన్నారు.


