యువతకు శిక్షణ
సద్వినియోగం చేసుకోండి..
● శ్రీకాకుళం ఐటీఐ శిక్షణా కేంద్రంలో స్వల్పకాలిక కోర్సులు ● అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సైబరీ సెక్యూరిటీ, మీడియా అనలిస్ట్ కోర్సులు అందజేత ● మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు ● ఈ నెల 29తో గడువు పూర్తి
ఉపాధే లక్ష్యంగా..
శ్రీకాకుళంలోని డీఎల్‌టీసీ శిక్షణా కేంద్రం
శ్రీకాకుళం న్యూకాలనీ: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, డిమాండ్ ఉన్న రంగాల్లో శిక్షణ అందించేందుకు పారిశ్రామిక శిక్షణా సంస్థలు నడుంబిగించాయి. స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ అందించి త్వరితగతిన అవకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేశాయి. దీనిలో భాగంగా అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
డీఎల్‌టీసీ శిక్షణా కేంద్రంలో..
శ్రీకాకుళం నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ ఐటీఐ శిక్షణా కేంద్రంలో స్వల్పకాలిక శిక్షణా కోర్సులను అందిస్తున్నారు. డీఎల్‌టీసీలో ఏర్పాటుచేసిన స్కిల్ హబ్‌లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 లో భాగంగా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్‌మీడియా ఎనలిస్ట్ (కంప్యూటర్ స్కిల్స్) కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు చేయడానికి ఈ నెల 29 గడువు ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్‌ఫొటోలతో డీఎల్‌టీసీలో సంప్రదించాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు 70957 31303 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
స్వల్పకాలిక కోర్సులివే..
అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రీషియన్‌గా నిలదొక్కుకునేవారి కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. కోర్సు కాలవ్యవధి 3 నెలలు. కనీస విద్యార్హత 10వ తరగతి. వయస్సు 10 నుంచి 30 ఏళ్లు.
కంప్యూటర్ స్కిల్స్: ప్రస్తుత తరుణంలో అత్యంత డిమాండ్ ఉన్న సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ పేరిట కంప్యూటర్ స్కిల్స్‌ను అందించేందుకు కోర్సును రూపొందించారు. కోర్సు కాలవ్యవధి 3 నెలలు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో ఆపై అర్హతలు కలిగినవారు ఎవరైనా చేరవచ్చు.
యువతకు గొప్ప అవకాశం స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు. గొప్ప డిమాండ్ ఉన్న రెండు కోర్సుల్లో డీఎల్‌టీసీ స్కిల్ హబ్ ద్వారా పీఎంకేవీవైలో భాగంగా శిక్షణ అందించాలని నిర్ణయించాం. ఈ నెల 29లోగా ఆసక్తి కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలి.
– వై.రామ్‌మోహన్‌రావు,
డీఎల్‌టీసీ అసిస్టెంట్ డైరెక్టర్, శ్రీకాకుళం
యువతకు శిక్షణ


