కౌలు రైతులకూ ‘సుఖీభవ’ అమలు చేయాలి
రణస్థలం: కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రణస్థలంలో రైతు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జిల్లాలో దాదాపు లక్ష మంది కౌలు రైతులు ఉంటే జిల్లా యంత్రాంగం ఇచ్చిన రికార్డు లు ప్రకారం 7 వేలు కౌలు రైతులను పేర్కొన్నారని, వీరికి అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.20వేలు కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కిసాన్ జిల్లా నాయకులు ఆబోతుల వెంకటనాయుడు పాల్గొన్నారు.


