● సాయం అందేనా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ఓ వైపు వరుణుడు ప్రకోపం ప్రదర్శిస్తున్నాడు. మరోవైపు సర్కారు అంతులేని నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇంకోవైపు నిబంధనలు ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. కలగలిపి రైతుకు కష్టం.. నష్టం తప్ప ఇంకేమీ మిగలడం లేదు. ఎండనక, వాననక కష్టపడి పంటను కాపాడుకుంటూ వస్తే మోంథా తుఫాన్ నిండా ముంచేసింది. నేల కొరిగిన వరి చేనులు రైతుల వైపు దీనంగా చూస్తున్నాయి. తడిచిన మొక్కజొన్న కంకులు, తడిచిన పత్తి అన్నదాత కళ్లల్లో ఆందోళనను చూసి చలించిపోతున్నాయి. ఎటు చూసినా నష్టాలు మూటగట్టుకున్న రైతులే కన్పిస్తున్నారు. ముఖ్యంగా మోంథా తుఫాన్ రైతులను నట్టేట ముంచింది. కోత దశలో ఉన్న పంట ఎక్కడికక్కడ నేలపాలైంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుఫాన్ మిగిల్చిన నష్టం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
సాయం చేయాల్సిన ప్రభుత్వం ఆదుకుంటోందా అంటే అదీ లేదు. బయటకు కనబడని నష్టాన్ని గుర్తించడం లేదు. 33 శాతం కన్న తక్కువ నష్టం ఉందని జాబితాలో నుంచి తీసేసింది. జిల్లాలో 12,500 హెక్టార్లకు పైగా పంట నేలకొరగడమే కా కుండా ముంపునకు గురైంది. కానీ అధికారులు ప్రాథమిక దశలో 9050 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని గుర్తించారు. 23 మండలాలపై తుఫాన్ ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంట కు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. అధికారిక ప్రాథమిక లెక్కలు ప్రకారం 6200 మంది రైతులకు సంబంధించి పొలాలు ముంపునకు గురయ్యాయి. 100 ఎకరాల వరకు పత్తి, 75ఎకరాల వరకు మొక్కజొ న్న, 100ఎకరాల వరకు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి.
చి‘వరి’కి ఇలా..
ఎన్యుమరేషన్ పూర్తి చేసేసరికి జిల్లాలో 4,205 ఎకరాల్లోని పంట మాత్రమే నష్టం వాటిల్లినట్టు యంత్రాంగం నిర్ధారించింది. హెక్టార్‌కు రూ.25వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.4కోట్ల 20లక్షల మేర పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇక పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటల నష్టాలకై తే అతీగతి లేదు. ఏ మాత్రం నష్టం జరగలేదని తేల్చేసింది. అధికారుల సుదీర్ఘ అంచనాల తర్వాత కొండంత నష్టానికి గోరంతే గుర్తిస్తోంది. వాస్తవాలకు, లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. తమ పొలాల ముంపును పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని చెబుతున్నారు. 33శాతం కన్న ఎక్కువ నష్టం జరిగిన పంటనే లెక్కలోకి తీసుకోవాలని చెప్పడంతో ఏం చేయలేకపోతున్నామని అధికారులు తప్పించుకుంటున్నారు. ఇక గుర్తించిన నష్టానికి పరిహారం కూడా అంతంతమాత్రమే. ఎకరాకు రూ. 25వేలకు పైగా పెట్టుబడి పెడితే ప్రభుత్వం 2.5 ఎకరాలకు రూ. 25వేలు ఇస్తామని చెబుతోంది. అంటే పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొంది.
విత్తు నుంచి పంట వరకు శాపాలే..
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. గత ఏడాది పంటలకు గిట్టుబాటు ధరలే కాదు మిల్లర్ల మాఫియాకు తలొగ్గి కొనుగోళ్లే సరిగా చేయలేదు. దీంతో దళారులకు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది విత్తనాలు దొరక్క, యూరియా సమకూర్చక నానా కష్టాలు పడితే తాజాగా తుఫాన్ గాలులకు, వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణమైపోవడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో నోటి కాడి కూడు లాక్కున్నట్టు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కళ్లెదుటే నీటిపాలవ్వడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనల పేరుతో కాకి లెక్కలు కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారైనా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
అన్నదాతకు అడుగడుగునా ని‘బంధనాలు’
అటు వరుణుడి కోపం, ఇటు ప్రభుత్వ
నిర్లక్ష్యంతో రైతులకు నష్టాలు
మోంథా తుఫాన్‌తో మరింత కుదేలు
33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితేనే
పరిహారం అంటూ నిబంధన
ఎన్యుమరేషన్‌లోనే భారీగా తొలగింపు
న్యాయం జరిగేనా..?
న్యాయం జరిగేనా..?


