
పాములు వద్దు.. పాఠశాల ముద్దు
● పాములు పట్టేందుకు వెళుతున్న పిల్లల్ని గమనించిన ఎంఈఓ, హెచ్‌ఎం ● తల్లిదండ్రులను ఒప్పించి బడిలో చేర్పించిన వైనం
కంచిలి : ఇటీవల కంచిలి మండలం చొట్రాయిపురం పాఠశాలకు సందర్శనకు వచ్చిన ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్‌కు.. పాములు పట్టేందుకు వెళుతున్న రాఘవ అనే బడిఈడు పిల్లాడు కనిపించాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు మడ్డు తిరుపతిరావుతో కలిసి బాలుడి తల్లిదండ్రులు గురించి వాకబు చేశారు. అక్కడ సమీపంలో కొండపై నివసిస్తూ పాములు పట్టుకొని జీవనోపాధి సాగిస్తున్న దంపతులు చెరుకూరి రమేష్, లక్ష్మీల వద్దకు వెళ్లారు. వారి పిల్లలు రాఘవ, దీప్తిలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని చెప్పి ఒప్పించారు. దీంతో వారు తమ ఇద్దరు పిల్లలను శనివారం పాఠశాలకు తీసుకొచ్చారు. అబ్బాయి రాఘవను ప్రాథమిక పాఠశాలలో, బాలిక దీప్తిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. కార్యక్రమంలో సీఆర్‌పీ యారడి దీనబంధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.