
అమోనియా కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక భారీ కంటైనర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అమోనియా లోడ్‌తో వెళ్తున్న భారీ కంటైనర్ జర్జంగి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైర్‌ను ఢీకొని బోల్తాపడింది. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
అరసవల్లి: రాష్ట్రంలో మన జిల్లాను స్వచ్ఛంగా మార్చుకుందామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకొని వాయు కాలుష్య నివారణ థీమ్‌తో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వెనుక భాగంలో కాజీపేట కూడలి వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకర సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకరరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస: ఇటీవల కొన్ని పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్త కథనాలు పూర్తి అవాస్తవమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తనకు ఎటువంటి గ్యాంగ్‌లు లేవని, తన బలం ప్రజలేనని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కొంతమంది వ్యక్తులు బాధితులను ఉసుగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తన సాను భూతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.

అమోనియా కంటైనర్ బోల్తా