
పరేషన్..!
ఈనెల బియ్యం ఇవ్వలేదు
అవస్థలు తప్పడం లేదు
జలుమూరు:
అక్టోబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకుల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం తక్కువగా రావడంతో రేషన్ బియ్యం అందక వందల సంఖ్యలో లబ్ధిదారులు నష్టపోయారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద ఉన్న వే బ్రిడ్జి పాడైపోవడంతో బియ్యం బ్యాగుల్లో నాలుగు కేజీల వరకూ తరుగుతో తూకం వేయడం వలనే ఈ సమస్య వచ్చిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం సరిపోలేదు. ఫలితంగా రేషన్ దుకాణాల్లో బియ్యం లేకపోవడంతో డీలర్లు లబ్ధిదారులను తిప్పి పంపారు. మండలవ్యాప్తంగా 53 రేషన్ డిపోలకు 18,583 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 450 టన్నుల బియ్యం రావడంతో వాటిని ఆయా డీలర్లకు పంపించడం జరిగిందని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి కోటేశ్వరరావు తెలిపారు. ఇంతవరకూ బాగున్నా ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద వే బ్రిడ్జి పాడైపోవడంతో బస్తాల్లో రెండు నుంచి నాలుగు కేజీల వరకూ తరుగు వస్తోందని దీనివల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నారని సీఎస్‌డీటీ షరీప్ చెబుతున్నారు. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం ఇవ్వాలని నిబంధన ఉన్నా.. వాటికి సంబంధించిన అలాట్మెంట్ పౌర సరఫరా అధికారులు ఇవ్వకపోవడంతో బియ్యం సరిపోలేదని డీలర్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈనెల బియ్యం 955 కార్డుదారులకు ఇంకా అందలేదు. దీనిపై సీఎస్‌డీటీ షరీఫ్ మాట్లాడుతూ ఎవరెవరికి బియ్యం అందలేదో ఆయా డీలర్ల ద్వారా అడిగి వారికి బియ్యం అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నాకు ఈనెల బియ్యం ఇంకా ఇవ్వలేదు. అలాగే ఇంటికి వచ్చి వేలిముద్రలు తీసుకుంటామన్నారు. డీలర్లను అడితే పక్క గ్రామం వెళ్లమన్నారు. ఇదెక్కడ న్యాయం. నేను 75 ఏళ్ల ముసలిదానిని. నేను కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లగలను. అధికారులు స్పందించి నా బియ్యం నాకు ఇప్పించాలి.
– మెట్ట చిన్నమ్మి, వృద్ధురాలు, గంగాధరపేట
రేషన్ పంపిణీలో వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. జగన్ ప్రభుత్వంలో వలంటీర్లతో ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతినెలా ఇబ్బంది అవుతోంది. ఈనెల ఏకంగా బియ్యమే లేవంటున్నారు. మా పరిస్థితి ఏంటి. – మామిడి మల్లమ్మ, వృద్ధురాలు,
గంగాధరపేట

పరేషన్..!

పరేషన్..!

పరేషన్..!