
మోసం చంద్రబాబు నైజం
జలుమూరు: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడమే చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని కరవంజ – టెక్కలిపాడు క్లస్టర్ సమావేశంలో శనివారం మాట్లాడారు. పేదలకు వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తలపెట్టామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలోని మునకల చెరువుతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో బుడితి వద్ద అవలింగి గ్రామంలో మినీ పరిశ్రమ పెట్టి టీడీపీ నాయకులు మద్యం కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తిదే సిండికేట్ అని, వారి కుటుంబ సభ్యుల పేరిట మద్యం షాపులు ఉన్నాయని వివరించారు. అవలింగిలో కల్తీ జరిగిన మద్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. అనంతరం డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి ఎం.శ్యామలరావు, సర్పంచ్ జుత్తు నేతాజీ, గొల్లంగి జగన్నాథరావు, జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుడు దామ మన్మథరావు, రకావాడ చందనబాబు, ధర్మాన జగన్, ధర్మాన బువాజీ, తర్ర జీవరత్నం, కె.కూర్మారావు, బండి ఎర్రన్న, బలగ లక్ష్మీ, అర్జున్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.