
మాస్టర్‌ప్లాన్‌లో మార్పు!
● సర్వే చేస్తున్న నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం ● ప్రభుత్వానికి త్వరలో నివేదిక
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం మేరకు శ్రీకాకుళంలో అమలు చేయాలనుకుంటున్న కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో జిల్లా అధికారులు పునరాలోచనలో పడ్డారు. ‘మాస్టర్ ప్లాన్‌తో గుండెల్లో గుబులు’ పేరిట రెండు రోజుల క్రితం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. 150 అడుగులు రోడ్డును నిర్మిస్తే ఏయే ప్రాంతాలు దెబ్బతింటాయో పరిశీలించాలని నగరపాలక సంస్థ, సుడా అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా శాఖలోని ప్రణాళికా విభాగం అధికారులు మంగళ, బుధవారాల్లో సర్వే నిర్వహించారు. ఈ రోడ్డు పరిధిలో ఏయే భవనాలు దెబ్బతింటాయో పరిశీలించి నివేదించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీని ఆధారంగా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి, ప్రభుత్వానికి నివేదించాలని నిశ్చయించారు. అటు తర్వాత మాస్టర్ ప్లాన్ వల్ల ఆలయాలు, అపార్ట్‌మెంట్లు, భవనాలు, ఆస్పత్రులు దెబ్బతింటాయని జిల్లా ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి నివేదించి, కొత్తగా చేసిన మార్పుల మేరకు ప్రభుత్వం ఆమోదించేలా చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రోడ్డు వేయాలనుకునే ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఉన్న పక్షంలో వాటిలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా, కేవలం నగరపాలక సంస్థ అనుమతితో నిర్మించిన భవనాలను ఉంటే వాటిని పరిగణలోనికి తీసుకుంటారని సమాచారం.
మాస్టర్ ప్లాన్‌లో చిన్న చిన్న మార్పులు చేయాలని జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మేరకే సర్వే చేస్తున్నాం. ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండే లా మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తాం. గతంలో ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌లో స్వల్ప మార్పులు చేసి భవనాలు లేని ప్రాంతం నుంచి 150 అడుగుల రోడ్లు, ఇతర రోడ్లు నిర్మాణం అయ్యేలా కొత్తప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం. జిల్లా అధి కారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొత్తగా ప్లాన్ తయారుచేసి తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. – ప్రసాదరావు,
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్