
స్వర్ణకిరణాలు
సకలాభరణాలు..
● అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
● ఆదిత్యుని తాకిన లేలేత కిరణాలు
● నేడు కూడా కిరణ స్పర్శకు అవకాశం
అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి కొలువుదీరిన అరసవల్లిలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యోదయ సమయాన సుమారు ఎనిమిది నిమిషాల పాటు గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుకు కిరణాభిషేకం జరిగింది. లేలేత తొలి సూర్యకిరణాలు వస్తూనే.. రాజమార్గమంతా ఎర్రని తివాచీలా మారింది. అలా రాజగోపురం నుంచి ఉదయం 5.55 గంటల నుంచి 6.03 గంటల వరకు కిరణాలు స్వామి సన్నిధిలోనే ఉండిపోయాయి. అంతరాలయం మీదుగా గర్భాలయంలోనికి చేరుకున్న కిరణ కాంతులు ముందుగా శ్రీవారి మూలవిరాట్టు పాదాల చెంత ఉన్న రథసారథి అనూరుడిని తాకాయి. దీంతో గర్భాలయమంతా దివ్యకాంతితో మెరిసిపోయింది. తర్వాత క్షణంలో స్వామి వారి ఉదర భాగం, వక్ష భాగాలను తాకుతూ సుమారు 3 నిమిషాలకుపైగా దివ్యముఖ రూపంపైనే కిరణ కాంతి కేంద్రీకృతమయ్యింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. మరోవైపు, ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో దర్శనాలు సజావుగా జరిగాయి. గురువారం కూడా వాతావరణం అనుకూలిస్తే కిరణ దర్శనం ఉంటుందని ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. కాగా తొలిసారిగా దర్శించుకున్న వారికి మాటలకు అందని అనుభూతి కలగగా...ఇప్పటికే పలుమార్లు వీక్షించిన వారికి ఆనంద పరవశులయ్యారు.