
నదులకు వరద ముప్పు
● వంశధారకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
● తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08942–240557) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఒడిశా–ఉత్తరాంధ్రలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల వేస్తున్న నేపథ్యంలో జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
గొట్టా బ్యారేజీ వద్ద 3న నది ప్రవాహం ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే శ్రీకాకుళం, గార, కొత్తూరు, పోలాకి, జలుమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలు ప్రభావితమవుతాయని చెప్పారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే 39 గ్రామాలు ప్రభావితమవుతాయన్నారు.
నాగావళి పరివాహక ప్రాంతంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తోటపల్లి, నారాయణపురం జల వనరుల వద్ద ప్రమాద హెచ్చరిక స్థాయి దాటితే ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు ఉంటుందన్నారు.
లోతట్టు, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు.