
శాసనసభలో అవగాహనతో మాట్లాడాలి
సారవకోట: శాసనసభలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అవగాహన లేకుండా మాట్లాడారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. బుధవారం సారవకోటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలని చెప్పుకుంటున్న వారు బీసీ–ఏకి చెందిన వడ్డి కులస్తులని, వారి కోసం గతంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిశోధన సంస్థ అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని తెలిపారు. అది తెలుసుకోకుండా శాసనసభలో అవగాహన రాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ఓట్లు కోసం నకిలీ బెంతు ఒరియాల కోసం శాసనసభలో మాట్లాడటం విచారకరమన్నారు. జిల్లాలో ఆదివాసీలకు అవసరమైన ఐటీడీఏ లేదని, నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో సుమారు వెయ్యి మంది శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై శాసనసభలో మాట్లాడం లేదన్నారు. ఆయనతో పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు జన్ని దాలయ్య, బొమ్మాళి కృష్ణ, బాలరాజు, నాగయ్య, రంగారావు తదితరులున్నారు.