
డిమాండ్లు నెరవేర్చాల్సిందే
● ప్రభుత్వానికి స్పష్టం చేసిన పీహెచ్‌సీ వైద్యులు
● జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ
అరసవల్లి:
గ్రామీణ వైద్యుల సమస్యలు, డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గొంతెత్తారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద జిల్లాలోని 71 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు సామూహిక ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గ్రామీణ పీహెచ్‌సీ వైద్యులకు టైం బౌండ్ ప్రమెషన్లు కల్పించాలని, జీవో 99 రద్దు చేయాలని.. ఇన్‌సర్వీస్ జీపీ కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50 శాతం గిరిజన భత్యాన్ని అందించాలని, చంద్రన్న సంచార చికిత్సకు రూ.5 వేలు భత్యంగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పీహెచ్‌సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ ప్రతిష్టా శర్మ, సుధీర్, పావని, సుమప్రియ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో 73 మంది వైద్యుల నియామకం
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రజారోగ్య సేవలకు అంతరాయం లేకుండా ఇతర విభాగాల నుంచి వైద్యులను డిప్యుటేషన్ ప్రాతిపదికను నియమించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో 73 మంది వైద్యులను పీహెచ్‌సీల్లో ప్రత్యామ్నయ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేశారు. బుధవారం నుంచే వీరంతా విధుల్లోకి వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ (జనరల్ ఆసుపత్రి)లో పనిచేస్తున్న 33 మంది వైద్యులతో పాటు డీసీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రి (టెక్కలి), ఏరియా ఆసుపత్రి (నరసన్నపేట), కమ్యూనిటి ఆసుపత్రులకు చెందిన 40 మంది వైద్యులకు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగించారు. కాగా, సుదూర ప్రాంతాల్లో ఉన్న పీహెచ్‌సీలకు తమను పంపించడంపై పలువురు వైద్యులు మండిపడుతున్నారు.
చర్యలు తప్పవు..
ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యులంతా సమ్మెలో ఉన్నందున ప్రత్యామ్నయంగా 73 మందిని నియమించి డ్యూటి చార్ట్ కేటాయించామని చెప్పారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రోగ్రా ంలకు ఇన్‌చార్జి ఆఫీసర్లుగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఎవరైనా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.

డిమాండ్లు నెరవేర్చాల్సిందే