
చోరీ సొత్తు స్వాధీనం
● హిజ్రా అరెస్టు
కంచిలి/పలాస: మండల కేంద్రం కంచిలిలో ఈ ఏడాది జూలై 5న రిటైర్డు లెక్చరర్ పురెళ్ల సింహాద్రి ప్రధాన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి కొంత సొత్తును రికవరీ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. 25 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురికాగా 12 తులాల ముప్పావు బంగారు ఆభరణాలు, 55.88 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ కేసులో ఐదుగురు నిందితుల్లో ఒకరైన కంచిలిలో రైల్వేస్టేషన్ వెనుకవైపు నివాసం ఉంటున్న కవిటి మండలం కవిటి పట్టణం కండ్రవీధికి చెందిన నాగుల సోనియా అనే హిజ్రా బుధవారం ఉదయం 11 గంటలకు సోంపేట వైపు నుంచి కంచిలి రైల్వేస్టేషన్ వైపు చేతిలో కవర్ పట్టుకొని వస్తోంది. పోలీసులను చూసి పారిపోతుండగా సోంపేట సీఐ బి.మంగరాజు సిబ్బంది సాయంతో పట్టుకున్నారు. ఈ క్రమంలో జూలై 5న రాత్రి బూరలు అమ్ముకొనే బాబు(భోపాల్, మధ్యప్రదేశ్), కబాడియా(ఔరంగాబాద్, మహారాష్ట్ర), సనాటా(కోట, రాజస్థాన్), టున్ని అనే నలుగురు వ్యక్తులతో కలిసి కంచిలిలోని సింహాద్రి ప్రధాన్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద 105.53 గ్రాములు బంగారు, డైమండ్ లాంగ్ నెక్లెస్(హారం), 41.57 గ్రాముల మామిడి పిందెల బంగారు చైన్, 3.88 గ్రాముల చెవి రింగులు, 55.88గ్రాముల వెండి గిన్నెలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సోంపేట సీఐతో పాటు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు, సిబ్బంది ఉన్నారు.