
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● 93 ఫిర్యాదుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి 93 అర్జీలు స్వీకరించారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకొని డీఎస్సీకి ఎంపికై న 12 మందిని అభినందించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి..
మెళియాపుట్టి: సుర్జిని గ్రామ పరిధిలో గ్రానైట్ క్వారీ వల్ల సమస్యలు మొదలవుతాయని, తమను ప్రశాంతంగా బతకనివ్వాలని మెళియాపుట్టి మండలం బాణాపురం సర్పంచ్ పెద్దింటి చంద్రరావు, విశ్రాంత ఉపాధ్యాయులు కొర్ల కృష్ణమూర్తి తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా బయట గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ ముగించారని, సుర్జిని గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వలేదన్నారు.