
ఓపిక నశించి
● నిరసనకు దిగిన పీహెచ్‌సీ వైద్యులు
● ఓపీ సేవలకు దూరం
● నేటి నుంచి పూర్తిస్థాయి
వైద్యసేవలు
బంద్
అరసవల్లి: ప్రభుత్వ వైఖరితో సర్కారు వైద్యుల్లో ఓపిక నశించిపోయింది. దీంతో వైద్యులంతా నిరసన బాట పట్టారు. ముందస్తు నోటీసు ప్రకారం సోమవారం నుంచి ఓపీ సేవలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గత రెండు రోజుల నుంచి అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి నిష్క్రమించిన వైద్యులు ఆన్‌లైన్ నివేదికలను పంపించడాన్ని కూడా నిలిపివేశారు. తాజాగా ఓపీ సేవలను అన్ని పీహెచ్‌సీలలో నిలిపివేయడంతో రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం అనుమతిస్తూ తమ వృత్తిధర్మాన్ని పాటించారు.
ఓపీ సేవలకు దూరంగా
జిల్లాలో 72 గ్రామీణ పీహెచ్‌సీల్లో సుమారు 125 మంది వైద్యులు సమ్మెబాట పట్టారు. ఇందులో భాగంగా ఔట్‌పేషెంట్(ఓపీ) సేవలకు అనుమతి నిరాకరించడంతో ఎక్కడికక్కడ రోగులు ప్రభుత్వ వైద్యం కోసం పడిగాపులు కాశారు. ఒక్కో పీహెచ్‌సీకి 30 నుంచి 35 మంది రోగులు చొప్పున మొత్తం 2, 500 మంది సోమవారం ప్రభుత్వ వైద్యానికి దూరమయ్యారు. వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధులతో రోగులు అవస్థలు పడ్డారు. అలాగే చిన్నారులకు, బాలింతలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిలిచింది.
నేటి నుంచి పూర్తిస్థాయి బంద్
రాష్ట్ర, గ్రామీణ పీహెచ్‌సీ వైద్య సంఘ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృత చర్చలకు అవకాశం ఇవ్వకపోవడంతో వైద్యు లు సమ్మె నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందిస్తున్న పీహెచ్‌సీ వైద్యులు మంగళవారం నుంచి పూర్తిస్థాయి వైద్య సేవలను నిలిపివేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా కేంద్రంలో పీహెచ్‌సీ వైద్యులంతా ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పీహెచ్‌సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సుధీర్(గుప్పెడుపేట), ప్రతిష్టాశర్మ(బాతువ), సుమప్రియ(పోలాకి), పావని(చాపర) బృందం ఆధ్వర్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నారు. మెళియాపుట్టి మండలం చాపర పీహెచ్‌సీలో వైద్యురాలు పావని అత్యవసర వైద్యం కింద ఓ గర్భిణికి డెలివరీ చేసి తమ వైద్య వృత్తి ధర్మాన్ని చాటుకోవడం గమనార్హం.
చాపర పీహెచ్‌సీలో వైద్యం కోసం వేచి ఉన్న ఓపీ రోగులు

ఓపిక నశించి