
వ్యయ ప్రయాసల రేషన్
అప్పుడే బాగుండేది..
డిపో ఏర్పాటుచేయాలి
● ఉచిత రేషన్ తీసుకొచ్చేందుకు రూ.200 ఖర్చు ● ఏడు గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని వ్యధ ● కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. గిరిజనులకు శాపం
హిరమండలం : కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది ఆ ఏడు గిరిజన గ్రామాల పరిస్థితి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటా రేషన్ సరఫరా చేయడంతో అప్పట్లో ప్రతి ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ తెచ్చుకోవాలంటే రూ.200 ఖర్చవుతోందని హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ పంచాయతీలో లోకొండ, మామిడిజోల, మొగడపేట, గోడిపాడు, పూలకొండ, తాళ్లపాడు, లింగుపురం తదితర గ్రామాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. గిరిజనులు కూడా నిశ్చింతగా తీసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంటింటా రేషన్ సరఫరా చేసే వాహనాలను తొలగించింది. పాత రేషన్ విధానాన్ని పునరుద్ధరించింది. దీంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి.
సుదూరంగా డిపో..
లోకొండ పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో రేషన్ డిపో కేటాయించకుండా భగీరథపురంలో డిపో ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తోంది. ఉచిత రేషన్ కోసం కుటుంబానికి 30 నుంచి 50 కిలోల బియ్యం అందిస్తున్నారు. ఆ బియ్యాన్ని తెచ్చుకునేందుకు ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.200 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి లోకొండ పంచాయతీ పరిధిలో రేషన్ డిపోను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో ఎంతో బాగుండేది. ఇప్పుడు పేరుకే ఉచిత రేషన్. తెచ్చుకోవాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? ప్రభుత్వం ఇప్పటికై నా తప్పిదాన్ని సరిచేయాలి. లోకొండ పంచాయతీ పరిధిలో డిపో ఏర్పాటుచేయాలి.
– ఎన్.బుడ్డమ్మ, లోకొండ
స్థానికంగా రేషన్ డిపో ఏర్పాటుచేయాలి. గతంలో ప్రతి ఇంటికి సులువుగా రేషన్ అందేది. ఇప్పుడు రేషన్ కావాలంటే 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ అందించాలి.
– కుద్దిగాం రాము, లోకొండ

వ్యయ ప్రయాసల రేషన్

వ్యయ ప్రయాసల రేషన్

వ్యయ ప్రయాసల రేషన్