
బ్యాంగిల్ షాపు దగ్ధం
టెక్కలి రూరల్: టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 10వ లైన్‌లో కోటిపల్లి కృష్ణారావు, దమయంతికి చెందిన బ్యాంగిల్ షాపు దగ్ధమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో షాపు నుంచి పొగ రావడంతో చుట్టుపక్కలవారు గమనించి షాపు యజమానికి ఫోన్‌లో సమాచారం అందించారు. యజమాని హుటాహుటిన షాపు వద్దకు చేరుకోగా అప్పటికే మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే షాపులో చీరలు, ఫ్యాన్సీ సామగ్రి, గాజులు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నరసన్నపేట: జమ్ము కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలాకి మండలం గాతలవలసకు చెందిన బమ్మిడి దామోదరరావు ఆదివారం ఉదయం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో (54) మృతి చెందాడు. స్థానిక హాటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దామోదరరావు డ్యూటీ ముగించుకొని జమ్ము కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్సులో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. దామోదరరావు భార్య వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
గంజాయితో పట్టుబడిన రౌడీషీటర్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని డచ్‌బంగ్లా వద్ద రెండు కిలోల గంజాయితో నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ పట్టుబడ్డాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలా ట హరికృష్ణ ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తెచ్చి డచ్‌బంగ్లా సమీపంలో విక్రయం చేసేందుకు వేచి ఉండగా ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ మహిళపై అఘాయిత్యానికి సంబంధించి కేసులో హరికృష్ణపై షీట్ ఓపెన్ అవ్వడం, కొట్లాట కేసు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు, కేసును సీఐ పైడపునాయుడు దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు పేర్కొన్నారు.
జనసేనలో వర్గ విభేదాలు
కంచిలి: జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకత్వంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌కు స్థానిక పార్టీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కష్టపడే నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు గుర్తింపు ఉండటం లేదని, ఇదేంటని ప్రశ్నిస్తే తాము వేరే పార్టీ వాళ్లమంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడుతూ గొడవలు సృష్టిస్తున్నారని వాపోయారు.