
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశ్వమానవ సమానత్వం కోసం తన కలంతో గర్జించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని బడుగు, బలహీనవర్గాల నాయకులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ఆదివారం జాషువా 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో ఉన్న కుల వివక్షత, అణచివేత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచి గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి అనేక రచనలు ద్వారా సమాజాన్ని చైతన్యపరచినా గొప్ప కవి గుర్రం జాషువా అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళల సమానత్వం కోసం అనేక రచనలు చేశారన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, దళిత సంఘాలు, బహుజన నాయకులు కళ్ళేపల్లి రాంగోపాల్, కంఠ వేణు, అమీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణ, కాగిత వెంకటరావు, యజ్జల గురుమూర్తి, కిల్లాన శ్రీనివాస్, ఆలాపన త్రినాథ్‌రెడ్డి, బోనెల రమేష్, సీర రమేష్‌బాబు, పడాల ప్రతాప్‌కుమార్, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకీరావు, సాంబారిక సూరిబాబు, గోల్లపల్లి నందేశ్ పాల్గొన్నారు.