
నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం రూరల్: పోటీ ప్రపంచంలో విద్యార్హతలు కంటే నైపుణ్యత ఉంటేనే రాణించగలమని జెమ్స్ సీఓఓ శ్రీధర్‌రెడ్డి అన్నారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బొల్లినేని బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్‌కేర్ కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా వైద్యరంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు మాత్రమే ఈ రంగంలో రాణించగలరని చెప్పారు. బీఎస్సీ ఎలైడ్ హెల్త్‌కేర్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. జెమ్స్ మెడికల్ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ రోగికి వైద్య చికిత్సలో ఎలైడ్ హెల్త్ కోర్సు విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు. వైద్యుని తరువాత స్థానం వీరిదేనన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టుదలతో చదివితే విజయం సొంతమవుతుందన్నారు. అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ మాట్లాడుతూ కళాశాల దశమ వార్షిక ప్రణాళిక, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.