
గంగమ్మ తల్లి గుడిలో చోరీ
నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో ఉన్న గంగమ్మ తల్లి గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త ముత్తా సింహాచలం తెలిపారు. గంగమ్మ తల్లి విగ్రహం మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారు శతుమానం, మూడు గ్రాముల వెండితో ఉన్న మట్టెలను దోచుకెళ్లారని తెలిపారు. అలాగే హుండీని ఎత్తుకుపోయారన్నారు. హుండీలో రూ.20 వేల వరకూ నగదు, కొన్ని వెండి వస్తువులు ఉంటాయని వివరించారు. ప్రతిఏటా నవంబర్ నెలలో హుండీ లెక్కించి వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తామని, ఇంతలో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.