
ఇంకెంత కాలం రైతులు రోడ్డెక్కాలి..?
ఇచ్ఛాపురం రూరల్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలించిన ప్రతిసారీ రైతులు ఏదో సమస్యతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇంకెంత కాలం ఇలా రైతులు రోడ్డెక్కాలని జెడ్పీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ ప్రశ్నించారు. రైతు పోరులో భాగంగా శనివారం ఆమె రైతులు, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి యూరియా కష్టాలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటే, కేవలం 320 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. దీంతో రైతులు అధిక మొత్తాన్ని చెల్లించి ఒడిశాలో యూరియాను కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇస్తున్న యూరియాను కూటమి నాయకులు తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇస్తున్నారన్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో యూరియాను అన్నదాతలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఎన్.వెంకటరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్, మండల కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, నాయకులు సల్ల దేవరాజు, కారంగి మోహనరావు, తడక జోగారావు, దక్కత నూకయ్యరెడ్డి, ఎన్.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.