
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరణకు సిద్ధం కావడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరంగి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీపతి, యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేపట్టగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని, దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య విద్య అందని అందని ద్రాక్షలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సీనియర్ న్యాయవాది తంగి శివప్రసాదరావు, న్యాయవాదులు పొన్నాడ రుషి, కూన అన్నంనాయుడు, గణపతినాయుడు, విజయ్‌కుమార్, నీలాద్రి, సుధాబాల, అప్పారావు పట్నాయుకుని, ఉషా తదితరులు పాల్గొన్నారు.