
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
● 134 కేసుల్లో 106 మంది అరెస్టు ● డీఐజీ గోపినాథ్ జెట్టి
శ్రీకాకుళం క్రైమ్: సోషల్ మీడియాలో అసత్య ప్రచా రాలు చేస్తూ, మహిళలను అగౌరవపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై గట్టి నిఘా పెట్టామని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. రేంజి పరిధిలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీలతో వర్చువల్‌గా సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. పోస్టులు మితిమీరుతుండడంతో ప్రతీ జిల్లాలో పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక బృందాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని గుర్తించాలన్నారు. వారు పెట్టిన పోస్టు ఏ కేటగిరీకి వస్తుంది.. వారిపై ఎటువంటి చర్యలు చేపట్టార న్న అంశాలపై రోజువారి నివేదిక తనకు పంపాల ని అధికారులను ఆదేశించారు. గుర్తించిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారికి సహకరిస్తున్న వ్యక్తుల ను వ్యవస్థీకృత నేరమునకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు.
106 మంది అరెస్టు
రేంజి పరిధిలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 134 మందిపై కేసులు నమోదు చేసి, 106 మందిని అరె స్టు చేశామని, 57 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ ప్రారంభమైందన్నారు. డీఎస్పీ లు వారి పరిధి స్టేషన్లలో ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అభ్యంతరకర పోస్టు లు పెడుతున్న వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరన్నది స్పష్టం చేయాలన్నారు.